నేరస్తుల పాలిట సింహ స్వప్నం “వర్ష” ఇక లేదు

వర్ష పేరు వింటే నేరస్తుల గుండెల్లో రైళ్లు పరుగెడుతాయి. దోపీడీలైనా, దొంగలైనా, హత్యలైనా, ఆత్మహత్యలైనా క్షణాల్లో అక్కడవాలిపోతుంది. ఇట్టే నేరస్తుల్ని పట్టేస్తుంది. క్రిమినల్స్‌కు సింహ స్వప్నంలా మారిన వర్ష అర్థంతరంగా చనిపోయింది. విజయనగరం జిల్లా క్రైం డిటెక్షన్‌లో ట్రాకర్‌గా ఉన్న వర్ష అనే జాగిలం ఎన్నో కేసులను పరిష్కరించింది. నేరస్తుల పాలిట సింహ స్వప్నంలా మారింది. లేబర్ డాగ్ జాతికి చెందిన వర్ష 2011 నవంబర్ 28న పుట్టింది. హైదరాబాద్ సెక్యూరిటీ వింగ్‌లో ట్రైనింగ్ పొంది.. శిక్షణ సమయంలోనే ఎక్సలెంట్ గ్రేడింగ్ స్థాయిని అందుకుంది. అటు నుంచి విజయనగరం వచ్చి నేర పరిశోధనలో కీలక పాత్ర పోషించింది. ఈ జాగిలానికి పోలీస్ అధికారులే వర్ష అని పేరు పెట్టారు.

సుమారు 135 కేసుల్లో వర్ష తన ప్రతిభను చూపించింది. జిల్లాలోని ధర్మపురి, తాళ్లబురిడిలో పలు హత్య కేసుల్ని చేధించి నిందితులకు శిక్ష పడేలా చేసింది. వర్ష చేధించిన కేసుల్లో పలువురికి శిక్ష పడగా.. మరో 50కి పైగా కేసులు విచారణలో ఉన్నాయి. క్రిమినల్ ఎంతటి ఇంటెలిజెంట్ అయినా వర్ష నుంచి తప్పించుకోలేరు. నేరస్తులు వదిలేసిన క్లూలను ఈ జాగిలం ఇట్టే పసిగడుతుంది. అందుకే జిల్లాలో ఎక్కడ ఏ నేరం జరిగినా అక్కడికి వర్షను తీసుకువెళ్తారు పోలీసులు. అంతేకాదు జిల్లాలో ఏ ప్రభుత్వ కార్యక్రమం జరిగినా ముందుగా ఈ జాగిలం ఆయా ప్రాంతాల్లో.. తనిఖీలకు క్లియరెన్స్ ఇచ్చిందంటే ఆ ప్రాంతాలు సేఫ్ జోన్‌లో ఉన్నట్లే. పోలీస్ శాఖకు వర్ష అందించిన సేవలను గుర్తించిన ఉన్నతాధికారులు ఎన్నో అవార్డులు, రివార్డులు అందించారు. లక్షల రూపాయల నగదు పారితోషికం కూడా ఇచ్చారు.

క్రైం డిటెక్షన్ వింగ్‌లో మంచి పేరు తెచ్చుకుని పోలీసులకు ఎంతో దగ్గరైన వర్ష అర్థంతరంగా అందరికీ దూరమైంది. అనారోగ్యంతో చనిపోయింది. ఈ వార్త విజయనగరం జిల్లా పోలీసులను కలిచి వేసింది. 100కు పైగా కేసులు పరిష్కరించిన వర్షకు పోలీసులు లాంఛనాలతో అంత్యక్రియలు నిర్వహించారు. కన్నీటి వీడ్కోలు పలికారు.

veegamteam

Read Previous

జమ్మూకాశ్మీర్ లెఫ్టినెంట్ గవర్నర్‌గా నరసింహన్..?

Read Next

దాడుల్ని ఖండించిన చంద్రబాబు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *