Breaking News

మమ్మల్ని బతకనివ్వండి

న్యూఢిల్లీ: కాశ్మీరీయులు ఎంతమాత్రం కాందిశీకులు కాదని, తామూ భారత పౌరులమేనని జమ్ము కాశ్మీర్‌ మాజీ ఎమ్మెల్యే, సిపిఎం కేంద్ర కమిటీ సభ్యుడు మహ్మద్‌ యూసఫ్‌ తరిగామి అన్నారు. దేశంలో సగటు పౌరులుగా తమనూ బతకనివ్వాలని భావోద్వేగంతో విన్నవించారు. తమ రాష్ట్ర ప్రజల హక్కులను ఇతర ప్రాంత ప్రజల హక్కులతో సమానంగా గౌరవించాలని కోరారు. నరేంద్ర మోడీ సర్కార్‌ తమను విదేశీయులుగా చిత్రీకరించేందుకు యత్నిస్తోందన్నారు. సకల భోగాలు కావాలని తాము ప్రభుత్వాన్ని కోరడం లేదని, కాశ్మీర్‌ అభివృద్ధిలో కలిసి నడవాలని మాత్రమే ఆశిస్తున్నట్టు తరిగామి తెలిపారు. ప్రభుత్వం చేపట్టే చర్యల్లో తమకు ఆమోదయోగ్యం కాని అంశం ఉంటే ప్రజాస్వామ్యయుతంగా ఆందోళన చేస్తాం తప్ప రాష్ట్ర ప్రభుత్వానికి, సాధారణ ప్రజానీకానికి ఎటువంటి ఆటంకాలు కల్పించబోమని స్పష్టం చేశారు. దీన్ని పట్టించుకోని మోడీ ప్రభుత్వం తమ హక్కులను కాలరాసే విధంగా ప్రవర్తిస్తూ అరెస్టులు, గృహ నిర్భంధాలు చేయడంపై తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. మంగళవారం నాడిక్కడ సిపిఎం ప్రధాన కార్యాలయం (ఎకెజి భవన్‌)లో తరిగామి, ఆ పార్టీ ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరితో కలిసి మీడియాతో మాట్లాడారు. ఆర్టికల్‌ 370 రద్దు అనంతరం జమ్ము కాశ్మీర్‌ నుండి వచ్చి మీడియాతో మాటాడిన తొలి కాశ్మీరీ తరిగామి కావడం గమనార్హం. గత 40 రోజులుగా కాశ్మీర్‌ రాష్ట్ర వ్యాప్తంగా వైద్య, సమాచార, రవాణా వసతులు లేవని, స్కూళ్లు, కిరాణా దుకాణాలు సైతం తెరుచుకోవడం లేదని తరిగామి వెల్లడించారు. దేశంలో కాశ్మీర్‌ను కలపడం అంటే భౌతికంగా మాత్రమే కాదని, మానసికంగా కూడానని అన్నారు. కాశ్మీర్‌ భారత్‌లో అంతర్భాగం అయినప్పుడు, కాశ్మీరీలు ఎందుకు భారత్‌లో అంతర్భాగం కాదని మోడీ సర్కార్‌ని ప్రశ్నించారు. కాశ్మీర్‌లో పరిస్థితి రోజురోజూకి దిగజారుతున్నది అక్కడి ప్రజానీకం వల్ల కాదని, కేవలం మోడీ సర్కార్‌ చర్యలతోనేనని స్పష్టం చేశారు. కేంద్రం తీసుకున్న చర్యలు కాశ్మీర్‌పై మాత్రమే దాడి కాదని, భారత రాజ్యాంగంపై కూడా దాడిగా భావిస్తున్నట్లు చెప్పారు. ఆర్టికల్‌ 370, ఆర్టికల్‌ 35(ఎ) తొలగించిన విషయం తెలియడంతో తాను ఎంతగానో మనోవేదనకు గురయ్యానన్నారు. భారత రాజ్యాంగ పెద్దలు లోతుగా విశ్లేషించి రూపొందించిన ఈ ఆర్టికల్స్‌ను ఇంత ఏకపక్షంగా తొలగించడం బిజెపికి మాత్రమే చెల్లిందని, రాష్ట్రాన్ని విభజించడంపై కూడా అక్కడి ప్రజలు, నాయకులతో ఎటువంటి చర్చలు జరపక పోవడం దారుణమన్నారు. భారత ప్రజాస్వామ్య చరిత్రలో అదొక మాయని మచ్చని అభివర్ణించారు. గత 30 ఏళ్ల చరిత్రలో తమ రాష్ట్రాన్ని ఎప్పుడూ ఇంత సుదీర్ఘకాలం నిర్బంధంలో ఉంచలేదని తరిగామి పేర్కొన్నారు. ఫరూక్‌ అబ్దుల్లాపై ప్రజా భద్రతా చట్టం (పిఎస్‌ఎ) కింద కేసు పెట్టడం ఏంటని ప్రశ్నించారు. ఆయన రాష్ట్రానికి చాలాకాలం సేవలందించిన మాజీ ముఖ్యమంత్రి అని, తీవ్రవాది కాదని చెప్పారు. తీవ్రవాదులపై పెట్టే కేసును ఒక రాజకీయ పార్టీ అధినేతపై పెట్టడం సరికాదన్నారు. ఈ చర్యతో ఆయనను రెండేళ్లపాటు పాటు ఎటువంటి విచారణ లేకుండానే నిర్బంధంలో వుంచవచ్చని అన్నారు. ఈ చర్యను తమ పార్టీ తీవ్రంగా ఖండిస్తోందన్నారు. కాశ్మీర్‌ ప్రజానీకం తీవ్రవాదులు, పాకిస్థాన్‌ ప్రభుత్వానికి మద్దతు ఇస్తున్నారని, అందుచేతనే ప్రభుత్వం అణచివేస్తోందని ఒక మీడియా ప్రతినిధి చేసిన వ్యాఖ్యలపై ఆయన కన్నీటి పర్యంతం అయ్యారు. 1990 నుంచి జరిగిన తీవ్రవాద ఘటనల్లో తన కుటుంబ సభ్యులను కోల్పోయానని అన్నారు. ప్రజానీకం కోసం పోరాడుతుంటే అటు మిలిటెంట్లు, ఇటు భారత సైన్యం తమను చిత్రహింసలకు గురి చేస్తున్నాయని, తమకంటే దేశ భక్తులు ఎవరుంటారని ఉద్వేగానికి లోనయ్యారు. బిజెపి నాయకులు తమని పాకిస్థాన్‌ తొత్తులు అని వ్యాఖ్యానించినప్పడు తాము ఎంతగానో మనోవేదనకు గురవుతున్నట్లు చెప్పారు. ఢిల్లీలో కూర్చొని కాశ్మీర్‌లో అంతా సవ్యంగా ఉందని, అక్కడి ప్రజానీకం అంతా ‘తుక్డే తుక్డ్డే గ్యాంగ్‌’ అంటూ బురద జల్లడం సరికాదన్నారు. కాశ్మీర్‌లో పౌర హక్కుల హననం : ఏచూరి కాశ్మీర్‌లో పౌర హక్కుల హననం జరుగుతోందని సిపిఎం ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి పేర్కొన్నారు. సుప్రీంకోర్టుకు ఇచ్చిన అఫిడవిట్‌లో వాస్తవ పరిస్థితి ప్రస్పుటించే విధంగా అంశాలు పేర్కొన్నట్లు తెలిపారు. ప్రభుత్వం చెబుతున్న దానికి అక్కడున్న పరిస్థితులకు ఎటువంటి పొంతన లేదని స్పష్టం చేశారు. నిర్బంధచర్యలను ప్రభుత్వం తక్షణమే ఎత్తివేయాలని ఏచూరి డిమాండ్‌ చేశారు. అక్రమంగా అరెస్టు చేసిన నాయకులు, సామాజిక కార్యకర్తలను విడుదల చేయాలన్నారు. కాశ్మీర్‌ నాయకులు, ప్రజానీకంతో ఇప్పటికైనా ప్రభుత్వం చర్చలు జరపాలని మోడీ సర్కార్‌ను డిమాండ్‌ చేశారు. లేనిపక్షంలో ప్రభుత్వంపై న్యాయపరంగా పోరాటం చేస్తామని హెచ్చరించారు.

one9 news

Read Previous

ఢిల్లీలో చుక్కలను అంటిన ఉల్లి ధరలు

Read Next

బోటు ప్రమాదంలో ఇవాళ 5 మృతదేహాలు లభ్యం

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *