
- మహారాష్ట్రలో రాష్ట్రపతి పాలన
- ఎన్‌సిపికి ఇచ్చిన గడువు ముగియకముందే గవర్నర్ సిఫార్సు
- హడావిడిగా కేంద్ర కేబినెట్ సమావేశం .. రాష్ట్రపతి ఆమోదముద్ర
- రాజ్యాంగ ద్రోహమని పలు పార్టీల ఆగ్రహం
- సుప్రీంకోర్టుకు శివసేన
న్యూఢిల్లీ/ముంబయి : కేంద్ర ప్రభుత్వం మహారాష్ట్ర ప్రజలపై రాష్ట్రపతి పాలనను రుద్దింది. ప్రభుత్వ ఏర్పాటుకు సమ్మతి తెలపడానికి ఎన్‌సిపికి ఇచ్చిన గడువు పూర్తికాకముందే ఆ రాష్ట్ర గవర్నర్ రాష్ట్రపతి పాలనకు సిఫార్సు చేశారు. గవర్నర్ ఈ సిఫార్సు చేసే సమయానికి ఎన్‌సిపి, కాంగ్రెస్‌ల మధ్య చర్చలు కొలిక్కి వచ్చాయి. ఢిల్లీ నుండి కాంగ్రెస్ నేతల బృందం ముంబయి బయలుదేరింది. వారు మహారాష్ట్ర రాజధానిలో దిగకముందే గవర్నర్ సిఫార్సును కేంద్రానికి పంపించేశారు. ఆ తరువాత ప్రధానమంత్రి నరేంద్రమోడీ అధ్యక్షతన హడావిడిగా జరిగిన కేంద్ర కేబినెట్ అంగీకరించడం, రాష్ట్రపతి ఆమోదముద్రకు పంపడం వంటి పరిణామాలు చకచకా జరిగిపోయాయి. ఆ తరువాత కాసేపటికే కేంద్రమంత్రి మండలి సిఫార్సులకు రాష్ట్రపతి రామ్‌నాధ్ కోవింద్ ఆమోదముద్ర వేశారు. ఆ వెంటనే మహారాష్ట్రలో రాష్ట్రపతి పాలన అమలులోకి వచ్చినట్లు కేంద్ర ప్రభుత్వం అధికారికంగా ప్రకటించింది. ఈ పరిణామంతో మహారాష్ట్ర ప్రజలు దిగ్భ్రాంతికి గురయ్యారు. గవర్నర్ చర్యను పలు పార్టీలు తీవ్రంగా ఖండించాయి. రాజ్యాంగానికి ద్రోహం చేశారని విమర్శించాయి. గవర్నర్ నిర్ణయాన్ని శివసేన సుప్రీంకోర్టులో సవాల్ చేసింది. బిజెపితో సమానంగా తమకు సమయం ఇవ్వకపోవడంతో పాటు, రాష్ట్రపతి పాలనను విధించడాన్ని ప్రశ్నించింది.
ఏం జరిగింది…?
ప్రభుత్వ ఏర్పాటు విషయమై సంసిద్ధత తెలియచేయడానికి శరద్ పవార్ నేతృత్వంలోని ఎన్‌సిపికి మంగళవారం రాత్రి 8.30 గంటల వరకు (24గంటలు) గడువు ఇచ్చిన సంగతి తెలిసిందే. అంతకుముందు తమకు 48 గంటల గడువు ఇవ్వాలన్న శివసేన విజ్ఞప్తిని ఆయన తిరస్కరించారు. గవర్నర్ కార్యాలయం నుండి వచ్చిన పిలుపుతో శరద్‌పవార్‌తో పాటు ఎన్‌సిపి నేతలు ప్రభుత్వ ఏర్పాటుకు కసరత్తు ప్రారంభించారు. శివసేన సానుకూలంగా స్పందించడంతో, కాంగ్రెస్‌తో చర్చల ప్రక్రియ ప్రారంభించారు. ఎఐసిసి అధినేత్రి సోనియాగాంధీతో శరద్‌పవార్ ఫోన్లో చర్చించారు. మరోవైపు కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ సమావేశం జరిగింది. ఈ సమావేశంలో తాజా పరిణామాలను చర్చించారు. మహరాష్ట్రలో ప్రభుత్వ ఏర్పాటుకు ఒక ఫార్మూలా ఈ సమావేశంలో తయారుచేశారు.బయటనుండి ప్రభుత్వాన్ని బలపరచాలని నిర్ణయించారు. సోనియా గాంధీ దూతలుగా కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేతలైన అహ్మద్‌పటేల్, మల్లికార్జున ఖర్గే, కెసి వేణుగోపాల్‌ను ముంబయికి బయలుదేరారు.
శరవేగంగా పరిణామాలు
కాంగ్రెస్ నేతలు ముంబాయికి బయలుదేరిన కాసేపటికే మహారాష్ట్రలో శరవేగంగా పరిణామాలు చోటుచేసుకున్నాయి. రాష్ట్రపతి పాలనకు గవర్నర్ సిఫార్సు చేశారన్న వార్తలు మంగళవారం మధ్యాహ్నం 1.30 గంటల ప్రాంతంలో టివి ఛానళ్లలో బ్రేకింగ్ న్యూస్‌లుగా ప్రసారమయ్యాయి. వీటిని గవర్నర్ కార్యాలయం ఖండించింది కూడా! అయితే, అది బుకాయింపేనని కాసేపటికే తేలిపోయింది. మంగళవారం సాయంత్రమే బ్రిక్స్ సదస్సుకోసం విదేశీ పర్యటనకు వెళ్లాల్సిఉన్న ప్రధాని మోడీ హడావిడిగా కేబినెట్ సమావేశాన్ని ఏర్పాటు చేశారు. దీంతో ఏదో జరగబోతోందన్న సంకేతాలు వచ్చాయి. మహారాష్ట్ర గవర్నర్ పంపిన సిఫార్సుపై చర్చించడానికే ప్రత్యేకంగా ఈ సమావేశం జరిగింది. ఈ సమావేశంలో గవర్నర్ సిఫార్సుకు కేంద్ర మంత్రిమండలి ఆమోదం తెలిపింది. ఆ వెంటనే రాష్ట్రపతి ఆమోదానికి పంపింది. ఆ తరువాత కాసేపటికే రాష్ట్రపతి ఆమోదముద్ర కూడా పడింది. ఎన్‌సిపికి గవర్నర్ ఇచ్చిన సమయం ముగియడానికి అప్పటికి ఇంకా మూడు గంటలపైగా సమయం ఉంది!
రాజ్యాంగ ప్రక్రియ విఫలమైంది : గవర్నర్
ఈ నెల 8వ తేదీతో మహరాష్ట్ర అసెంబ్లీ పదవీ కాలం ముగిసిందని, అయితే ప్రభుత్వ ఏర్పాటులో ఎవరూ ముందుకు రాకపోవడంతో రాజ్యాంగ ప్రక్రియ విఫలమైందని గవర్నర్ భగత్ సింగ్ కొశ్యారీ రాష్ట్రపతి పాలనకు చేసిన సిఫార్సులో పేర్కొన్నారు. ప్రభుత్వ ఏర్పాటకు ఎన్‌సిపి సిద్ధంగా లేదని ఆ పార్టీకి చెందిన కొందరు నేతలు చెప్పారని, ఆయన అన్నట్లు మీడియాలో వార్తలు వచ్చాయి.
మమ్మల్నెందుకు ఆహ్వానించలేదు : కాంగ్రెస్
గవర్నర్ సిఫార్సు, దానికి అనుగుణంగా కేంద్ర తీసుకున్న నిర్ణయంపై కాంగ్రెస్‌తో సహా పలు పక్షాలు ఆగ్రహం వ్యక్తం చేశాయి. గవర్నర్ రాజ్యాంగానికి ద్రోహం చేశారని, ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేశారని కాంగ్రెస్ అధికార ప్రతినిధి రణదీప్ సుర్జేవాలా అన్నారు. ఎస్ఆర్ బొమ్మై కేసులో సుప్రీం కోర్టు ఇచ్చిన తీర్పును ప్రస్తావించారు. ప్రభుత్వ ఏర్పాటులో బిజెపి, శివసేన, ఎన్‌సిపి విఫలమైతే రాష్ట్రంలో నాలుగో పెద్ద పార్టీగా ఉన్న కాంగ్రెస్‌ను ఎందుకు ఆహ్వానించలేదని ప్రశ్నించారు. ప్రభుత్వ ఏర్పాటులో సమ్మతి తెలిపేందుకు పార్టీలకు సమయం ఇచ్చే అంశంలో కూడా గవర్నర్ పక్షపాతం చూపించారని అన్నారు. బిజెపికి 48 గంటలు కేటాయించిన గవర్నర్, అదే శివసేన, ఎన్‌సిపిలకు 24 గంటలే కేటాయించడాన్ని తప్పుబట్టారు. మహారాష్ట్ర గవర్నర్ తీసుకున్న నిర్ణయం రాజ్యాంగాన్ని ఖూనీ చేయడమేనని సిపిఎం ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి విమర్శించారు. ఎన్‌సిపికి ఇచ్చిన సమయం ఇంకా మిగిలి ఉండగానే గవర్నర్ ఇటువంటి నిర్ణయం ఎలా తీసుకుంటారని ప్రశ్నించారు.
తమకు అదనంగా 48 గంటల సమయం ఇవ్వాలన్న అభ్యర్ధనను గవర్నర్ తిరస్కరించడంపై శివసేన సుప్రీం కోర్టును ఆశ్రయించింది. కేంద్రంలోని బిజెపి సర్కార్ ఆజ్ఞల ప్రకారమే గవర్నర్ నడుచుకుంటున్నారని విమర్శించింది. కేంద్రం తీసుకున్న నిర్ణయాన్ని తాము ఖండిస్తున్నామని పవార్‌తో సమావేశం అనంతరం నిర్వహించిన సంయుక్త మీడియా సమావేశంలో కాంగ్రెస్ నేతలు ఆహ్మద్ పటేల్, మల్లిఖార్జున ఖర్గే, కెసి.వేణుగోపాల్ పేర్కొన్నారు.