
జనసేన అధినేత పవన్ కల్యాణ్ ఇచ్చిన పిలుపు మేరకు.. రణస్థలం లో శనివారం మసీదు ఎదురుగా షాదీఖాన్ వద్ద డొక్కా సీతమ్మ భవన నిర్మాణ కార్మికుల ఆహార శిబిరాన్ని రణస్థలం జనసేన నాయకులు నిర్వహించారు. పెద్ద ఎత్తున భవన నిర్మాణ కార్మికులతో పాటు పలువురు పెద్దలు భారీ క్యూలో నిలబడి భోజనం చేశారు. ఈ సందర్భంగా జనసేన నాయకులు మాట్లాడుతూ.. గత నాలుగు నెలలుగా ఇసుక లభ్యం కాక భవన నిర్మాణ కార్మికులు ఎచ్చెర్ల నియోజకవర్గంలో వేలాదిగా ఆకలితో అలమటిస్తున్నారని, పవన్ కల్యాణ్ పిలుపు మేరకు.. ఆహార శిబిర కార్యక్రమాన్ని నిర్వహించినట్లు చెప్పారు. ప్రతి ఏడాది వరదలు వస్తున్నప్పటికీ ఇసుకకు ఎప్పుడూ లేని కొరత ఏర్పడిందని ప్రభుత్వ నిర్లక్ష్యమే కారణమని ఆరోపించారు. ఇసుక ధర కూడా సామాన్యులకు అందని ఎత్తుకు పెరగడంతో భవన నిర్మాణాలు నిలిచిపోయాయన్నారు. సిమెంట్ ధర సైతం ప్రస్తుతం దారుణంగా పెరిగిందని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో జనసేన సైనికులు డి. చిరంజీవి, వి.అంజిబాబు, ఎస్.రామారావు, అర్. భాస్కర రావు, ఎస్. సంతోష్, అన్నంనాయుడు తదితరులు పాల్గొన్నారు.