
న్యూఢిల్లీ : మహారాష్ట్ర అసెంబ్లీ బుధవారం సాయంత్రం 5 గంటల లోపు బలపరీక్ష నిర్వహించాలని సుప్రీంకోర్టు ఆదేశించిన నేపథ్యంలో కాంగ్రెస్ తాత్కాలిక అధ్యక్షురాలు సోనియా గాంధీ స్పందించారు. రేపు జరగబోయే బలపరీక్షలో తామే విజయం సాధిస్తామని ఆమె ధీమా వ్యక్తం చేశారు. నేషనలిస్టు కాంగ్రెస్ పార్టీ, కాంగ్రెస్, శివసేన కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తామని గత కొద్ది రోజుల నుంచి ప్రయత్నాలు చేస్తున్న విషయం విదితమే. అంతలోపే రాత్రికి రాత్రే భారతీయ జనతా పార్టీ – ఎన్సీపీ నాయకుడు అజిత్ పవార్‌తో కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన సంగతి తెలిసిందే. దీనిపై శివసేన, కాంగ్రెస్, ఎన్సీపీ కలిసి సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేశాయి. మొత్తానికి కోర్టు తీర్పు నేపథ్యంలో మహారాష్ట్ర రాజకీయ సంక్షోభానికి రేపు సాయంత్రం తెరపడనుంది.
ఫడ్నవీస్ రాజీనామా చేయాలి
సుప్రీంకోర్టు తీర్పు నేపథ్యంలో దేవేంద్ర ఫడ్నవీస్ ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేయాలని కాంగ్రెస్ నాయకులు పృధ్విరాజ్ చవాన్ డిమాండ్ చేశారు. బలపరీక్ష నిర్వహించాలని సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పుతో శివసేన, ఎన్సీపీ, కాంగ్రెస్ పార్టీ నాయకులు సంతృప్తిగా ఉన్నారని ఆయన తెలిపారు. రేపు ఉదయం 11 గంటలకు ఎమ్మెల్యేలంతా ప్రమాణస్వీకారం చేయనున్నారు. అనంతరం బలపరీక్ష జరగనుంది.
బీజేపీ ఆటలు సాగవు
సుప్రీంకోర్టు తీర్పుపై నేషనలిస్టు కాంగ్రెస్ పార్టీ నాయకుడు నవాబ్ మాలిక్ స్పందించారు. రేపు సాయంత్రం 5 గంటలలోపు ఎవరికీ మెజార్టీ ఉందో తెలిసిపోతోంది. ఇక బీజేపీ ఆటలు సాగవు. త్వరలోనే శివసేన – కాంగ్రెస్ – ఎన్సీపీ ప్రభుత్వం ఏర్పడబోతుందన్నారు నవాబ్ మాలిక్. సుప్రీంకోర్టు తీర్పు భారత ప్రజాస్వామ్యంలో ఒక మైలురాయి అని ఆయన పేర్కొన్నారు.