
డిల్లీ: భారత దేశం రాజ్యాంగాన్ని ఆమోదించి 70 ఏళ్లు నిండిన సందర్భంగా ఇవాళ పార్లమెంట్లో ఉభయసభలు ప్రత్యేకంగా సమావేశం అయ్యాయి. ఆ కార్యక్రమంలో ప్రధాని మోదీ మాట్లాడారు. జ్ఞానానికి మహా కేంద్రంగా పార్లమెంట్ విలసిల్లుతోందన్నారు. రాజ్యాంగ నిర్మాత బాబా సాహెబ్ అంబేద్కర్ను ప్రధాని మోదీ గుర్తు చేశారు. ఇది పార్లమెంట్లో చరిత్రాత్మక దినమన్నారు. 2008లో జరిగిన ముంబై ఉగ్రదాడిలో చనిపోయినవారికి ప్రధాని మోదీ తన ప్రసంగంలో నివాళి అర్పించారు. ఆ దాడిలో సుమారు 166 మంది మరణించారని ఆయన అన్నారు. మన రాజ్యాంగమే మనకు పవిత్ర గ్రంథమన్నారు. ఆ గ్రంథమే మన జీవితాలను, మన సమాజాన్ని, మన సాంప్రదాయాలను, నమ్మకాలను ప్రస్పుటిస్తుందన్నారు. కొత్తగా ఎదురవుతున్న సవాళ్లను కూడా ఆ గ్రంథం పరిష్కరిస్తుందన్నారు. రాజ్యాంగంలో పౌరుల హక్కులు, బాధ్యతలు ఉంటాయని, ఇదే మన రాజ్యాంగ విశిష్టత అని ఆయన తెలిపారు. రాజ్యాంగంలో పొందుపరిచిన బాధ్యతలను మనం ఎలా నెరవేర్చాలన్నదానిపై దృష్టిపెట్టాలన్నారు. మన బాధ్యతలను సంపూర్ణంగా, సక్రమంగా నిర్వర్తించడమే మన హక్కు అని గాంధీజీ అన్నట్లు మోదీ గుర్తు చేశారు. ప్రపంచం అంతా హక్కుల గురించి మాట్లాడుతుంటే, గాంధీజీ మాత్రం ఓ అడుగు ముందుకు వేసి పౌరుల బాధ్యతలను గుర్తు చేశారన్నారు.