Breaking News

కోహ్లీకి అసలు ఏమైంది.?

సిక్కులపై 1984లో మారణహోమం జరిగిన తర్వాత మళ్లీ ఇన్నేళ్లకు ఆనాటి దుర్ఘటనలను జ్ఞప్తికి తెచ్చేలా దేశరాజధానిలో ఘర్షణలు జరిగాయి. దాదాపు 75 రోజులుగా షాహిన్‌బాగ్‌లో అత్యంత శాంతియుతంగా, చట్టబద్దంగా, దేశభక్తియుతంగా సాగిన ఆందోళనను ఎదుర్కొనలేక, పరిష్కారం చూపలేక, సమాధానం చెప్పలేక పోయిన కాషాయ దళాలు పన్నిన కుట్ర ఫలితమే గత మూడు రోజుల అల్లర్లు, అరాచకాలూ, మారణహోమమూ. ఈ అల్లర్ల వెనక తమ కుట్ర బహిర్గతం అవుతుందన్న ఆదుర్దాతో కాషాయ నేతలు ఈ దుర్ఘటనలకు సామాన్య ప్రజలనే బాధ్యులుగా చిత్రీకరించడానికి విఫలప్రయత్నం చేస్తున్నారు.
పౌరసత్వ చట్ట సవరణను తెచ్చినది మొదలు దేశమంతటా దానిని వ్యతిరేకిస్తూ పలు ఆందోళనలు, నిరసనలు జరుగుతున్నాయి. పినరయి విజయన్‌ ప్రభుత్వం కేరళ అసెంబ్లీలో చేసిన తీర్మానం మోడీ ఏకపక్ష నిర్ణయానికి సవాలు విసిరింది. బెంగాల్‌, రాజస్థాన్‌, ఢిల్లీ, పంజాబ్‌, మధ్యప్రదేశ్‌ అసెంబ్లీలు ఎన్‌ఆర్‌సిని తమతమ రాష్ట్రాలలో అమలు చెయ్యబోమని ప్రకటించాయి. చివరకు ఎన్‌డిఎ భాగస్వామ్య పక్షాలు అకాలీదళ్‌, జెడి(యు), ఎల్‌జెపి సైతం ఎన్‌ఆర్‌సి ప్రక్రియను వ్యతిరేకించాయి. మోడీ, షా ద్వయం, ఆర్‌ఎస్‌ఎస్‌ మూకలు ఆశించిన రీతిలో దేశ ప్రజానీకం పౌరసత్వం విషయంలో హిందూ-ముస్లింలుగా మత ప్రాతిపదికన చీలిపోలేదు. ‘హిందూత్వ’ కుట్రను ప్రతిఘటించే విశాల లౌకిక ప్రజాతంత్ర చైతన్యం ముందుకొచ్చింది. ఆనాటి తెల్లవాడి ‘విభజించి పాలించు’ కుట్రను జాతీయోద్యమం లౌకిక ప్రజాతంత్ర స్ఫూర్తితో ఏవిధంగా తిప్పికొట్టిందో, నేడూ అదే విధమైన స్ఫూర్తిదాయక ప్రతిఘటన ఎదురవుతోంది. ఈ చైతన్యానికి షాహిన్‌బాగ్‌ ఒక ప్రతీక అయ్యింది. దానిని చట్టవిరుద్ధమైనదిగా చిత్రీకరించడానికి మొదట్లో బిజెపి విఫలయత్నం చేసింది. న్యాయస్థానాలను ఆశ్రయించింది. న్యాయస్థానం బిజెపి వాదనను అంగీకరించలేదు. పైగా ప్రజాస్వామ్యంలో నిరసన తెలిపే హక్కు అంతర్భాగమని స్పష్టం చేసింది. ఆందోళనకారులతో సంప్రదింపులకు తెరతీసింది. అంటే షాహిన్‌బాగ్‌ ఆందోళన చట్టబద్ధమేనని దేశ న్యాయ వ్యవస్థ చెప్పకనే చెప్పినట్లయ్యింది.
ఢిల్లీ ఎన్నికలు వాస్తవానికి పరిమిత అధికారాలున్న ఢిల్లీ రాష్ట్ర ప్రభుత్వ పగ్గాలు ఎవరి చేతికివ్వాలనే అంశానికి సంబంధించినవి. ఆప్‌ పార్టీ ఆ మేరకే తన ప్రచారాన్ని పరిమితం చేసింది. కాని బిజెపి ఢిల్లీ ఎన్నికలను పౌరసత్వ సమస్య చుట్టూ తిప్పడానికి పూనుకొంది. అమిత్‌షాతో సహా బిజెపి అగ్రనేతలు, కేంద్రమంత్రులు ఢిల్లీ ఎన్నికలలో ప్రత్యక్షంగా దిగారు. ఎన్‌ఆర్‌సిని వ్యతిరేకించడం అంటేనే దేశ ద్రోహం అన్నట్టు చిత్రీకరించేందుకు పూనుకున్నారు. షాహిన్‌బాగ్‌ ఆందోళనలను ‘ఉగ్రవాదుల’ కుట్రగా అభివర్ణించారు. ఎన్నికల ప్రచారంలోనే శృతి మించి పోవడంతో అనురాగ్‌ ఠాకూర్‌ వంటి బిజెపి నేతలను ప్రచారం చేయకుండా ఎన్నికల కమిషన్‌ నిషేధించింది. అన్నింటికీ మించి ఢిల్లీ ప్రజలు తమ విజ్ఞతను ప్రదర్శించారు. మత విద్వేష రాజకీయాలకు తావు లేదంటూ ఎన్నికల తీర్పు ఇచ్చారు.
దీనిని జీర్ణించుకోలేని పాలక కూటమి ఈ తాజా కుట్రకు తెరలేపింది. అల్లర్లు జరిగే ముందు రోజు స్థానిక బిజెపి నేత కపిల్‌ మిశ్రా షాహిన్‌బాగ్‌ ఆందోళనకారులను బెదిరిస్తూ, ఖాళీ చేయించాలని ఢిల్లీ పోలీసు అధికారులకు ఆదేశాలిస్తూ, హెచ్చరికలు జారీ చేస్తూ రెచ్చిపోయిన ఉదంతం వీడియోల్లో వైరల్‌ అయ్యింది. ఢిల్లీ హైకోర్టు న్యాయమూర్తి మురళీధర్‌ ఢిల్లీ పోలీసులకు ఇచ్చిన ఆదేశాలు బిజెపి నేతల దురాగతానికి నిలువెత్తు సాక్ష్యాలయ్యాయి. మోడీ-షా ప్రభుత్వం మరింత బరితెగించి జస్టిస్‌ మురళీధర్‌ను రాత్రికి రాత్రే బదిలీ చేసింది.
ఢిల్లీలో ముసుగులు వేసుకుని దాడులకు తెగబడ్డ వారిలో పలువురు యు.పి రాష్ట్రానికి చెందిన కాషాయ మూకలేనని లభిస్తున్న సాక్ష్యాధారాలు చెప్తున్నాయి. బాధితులలో సగం మందికి పైగా తగిలిన బులెట్‌ గాయాలు యు.పిలోని నేరస్తులు వాడే తుపాకులు చేసే గాయాల వంటివేనని పరీక్షలు ధ్రువపరుస్తున్నాయి. ‘ప్రాణాల మీద ఆశ వుంటే ఆందోళనలకు ఎందుకు దిగాల’ని యు.పి ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్‌ ఇటీవల చేసిన బహిరంగ ప్రకటన బిజెపి-ఆర్‌ఎస్‌ఎస్‌ ఎంతకు బరితెగించిందో స్పష్టం చేస్తుంది.
మరో వైపు ఇస్లామిక్‌ ఉగ్రవాదులు సైతం షాహిన్‌బాగ్‌ తరహా ఆందోళనలకు జీర్ణించుకోలేక పోతున్నారు. పెద్ద సంఖ్యలో ముస్లిం మహిళలు బహిరంగ ఆందోళనలకు దిగడం వారు భరించలేక పోతున్న నిజం. కాని వారు ఇన్నాళ్లూ ఏమీ చేయలేని పరిస్థితి. ఇప్పుడు కాషాయ దళాల కుట్ర ఈ మైనారిటీ ఉగ్రవాదులకూ ఊతం ఇచ్చినట్టయ్యింది. మత చిచ్చు రగల్చడంలో ఇద్దరూ తోడుదొంగలయ్యారు.
అయితే ఢిల్లీ ప్రజలు, లౌకిక శక్తులు తమ చేవను ప్రదర్శించారు. మసీదుల్లో హిందూ కుటుంబాలకు, దేవాలయాల్లో ముస్లిం కుటుంబాలకు రక్షణ కల్పించిన ఉదంతాలు, సామాన్య హిందూ, ముస్లిం, సిక్కు కుటుంబాలు పరస్పరం రక్షణగా నిలవడం శ్లాఘనీయం. అందుకే ఢిల్లీ పోలీసు బృందాలు ఎంత ఘోరంగా విఫలమైనా, ఎంత పక్షపాత, కక్షపూరిత వైఖరితో వ్యవహరించినా అల్లర్లు మూడు రోజుల్లోనే సద్దుమణిగాయి. ఢిల్లీ అల్లర్లు దేశ వ్యాప్తంగా లౌకిక ప్రజాస్వామ్య శక్తులు అప్రమత్తంగా వ్యవహరించాల్సిన అవసరాన్ని, ప్రజల ఐక్యతను కాపాడుకోవాల్సిన కర్తవ్యాన్ని ముందుకు తెచ్చాయి. లౌకిక భారతావని ఈ కర్తవ్యాన్ని తప్పకుండా నెరవేర్చి తీరుతుంది.

one9 news

Read Previous

విద్యాసంస్థల్లో ముస్లింలకు 5 శాతం రిజర్వేషన్…

Read Next

త్వరలో భారత్-పాక్ ఢీ.. వేదిక ఇదే..!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *