
ఆంధ్రప్రదేశ్ లో స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణ అంశం రోజురోజుకీ మరింత వివాదాస్పదంగా మారుతోంది. రాష్ట్ర ఎన్నికల సంఘం స్థానిక సంస్థల ఎన్నికలకు నోటిఫికేషన్ జారీ చేయడాన్ని జగన్ సర్కారు తీవ్రంగా పరిగణిస్తోంది. ఎస్ఈసీ నిమ్మగడ్డ రమేష్ కుమార్ నిర్ణయాన్ని సవాల్ చేస్తూ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పిటిషన్ దాఖలు చేసింది. శనివారం హైకోర్టులో హౌస్ మోషన్ పిటిషన్ దాఖలు చేసింది. హౌస్ మోషన్ పిటిషన్ను హైకోర్టు.. సోమవారం విచారించనుంది. ప్రభుత్వం స్థానిక సంస్థల ఎన్నికలకు సిద్ధంగా లేమని చెప్పినా.. రాష్ట్ర ఎన్నికల అధికారి నిమ్మగడ్డ రమేష్ కుమార్ దూరహంకాపురితంగా వ్యవహరిస్తున్నారని జగన్ ప్రభుత్వం ఆరోపిస్తోంది. దీంతో బాల్ హైకోర్టుకు చేరినట్లైంది.
ఇదిలావుంటే, గ్రామ పంచాయతీ ఎన్నికలను నాలుగు దశల్లో నిర్వహించేందుకు శుక్రవారం రాత్రి ఏకపక్షంగా షెడ్యూల్ జారీ చేసిన సంగతి తెలిసిందే. ఏకపక్ష ధోరణితో వ్యవహరిస్తున్న రాష్ట్ర ఎన్నికల కమిషనర్ (ఎస్ఈసీ) నిమ్మగడ్డ రమేష్ కుమార్ తీరుపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఓ వైపు కరోనా ఉధృతి కొనసాగుతుంటే గ్రామ పంచాయతీ ఎన్నికల షెడ్యూలు జారీ చేయడంపై అధికార వైసీపీ ఫైర్ అవుతుంటే, ఎన్నికల షెడ్యూల్ విడుదలను టీడీపీ, బీజేపీ స్వాగతించాయి. గత అనుభవవాలను దృష్టిలో పెట్టుకుని ప్రశాంత వాతావరణంలో ఎన్నికలు జరిపించాలని కోరుతున్నాయి.