
టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు పాల్పడుతున్న కుట్రల్లో పంచాయతీ ఎన్నికలు ఒక భాగమని మంత్రి కొడాలి నాని అన్నారు. కృష్ణా జిల్లా గుడివాడలో జరుగుతున్న సంక్రాంతి సంబరాల్లో ఆయన పాల్గొని మీడియాతో మాట్లాడారు. ప్రభుత్వం చేస్తున్న సంక్షేమ పథకాలకు ఏదో రకంగా మోకాలడ్డాలని చంద్రబాబు చూస్తున్నారని మండిపడ్డారు. జడ్పీటీసీ, ఎంపీటీసీ, మున్సిపల్ ఎన్నికలను పక్కనబెట్టి కుట్ర పూరితంగానే చంద్రబాబు డైరెక్షన్లో నిమ్మగడ్డ రమేష్ కుమార్ పంచాయతీ ఎన్నికలకు తెరలేపారని ఆరోపించారు. కుల, మతాలకు మధ్య గొడవలు సృష్టించే ఆలోచనలో ఉన్న చంద్రబాబుకు ప్రజల సంక్షేమం పట్టదన్నారు.
విద్వేషాలు రెచ్చగొట్టే ఆలోచనతో ఉన్న చంద్రబాబుకు, అతనికి వంతపాడే నిమ్మగడ్డకు అధికారులన్నా, పోలీసులన్నా, వ్యవస్థలన్నా పట్టవని ఆరోపించారు. తాను రాజ్యాంగ వ్యవస్థను అడ్డుపెట్టుకుని కుట్రలు చేస్తున్న చంద్రబాబు, నిమ్మగడ్డ రమేష్‌లు తగిన మూల్యం చెల్లించుకోక తప్పదని కొడాలి నాని వ్యాఖ్యానించారు.